సఖి గ్రూపులకు వివిధ అంశాలపట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా సామాజికంగా మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. యునెసెఫ్ సహకారంతో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సఖి కౌమార బాలికల వర్కుషాపు స్థానిక ఎస్‌విఎన్ హొటల్‌లో శుక్రవారం జరిగింది. ఈ వర్క్‌షాపులో కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, నడవడిక, విద్య, ఉపాధి, వ్యక్తిగత రక్షణ, వివిధ రకాల చట్టాలుపై అవగాహన కల్పించేందుకు సఖి గ్రూపులు ఒక వేదికగా ఉన్నాయని అన్నారు. ఈ గ్రూపులను ఆలంబనగా చేసుకొని, సమాజ దృక్ఫథంలో మార్పును తీసుకురావాలని కోరారు. దీనికోసం వివిధ రంగాల వ్యక్తులు, వివిధ శాఖలు మేథోమథనం ద్వారా సరైన పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ఇటువంటి వర్కుషాపులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఒకే వయసు ఉన్న వారందరినీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేయడం ద్వారా, వారి వ్యక్తిగత సమస్యలు సైతం బయటకు చెప్పే అవకాశం కలుగుతుందని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికి సఖి గ్రూపులు కృషి చేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాలికలు చదువుకొని, వృద్దిలోకి రావడానికి ఉన్న అపార అవకాశాలను గ్రూపు సభ్యులకు వివరించాలని సూచించారు. కేవలం వైద్యం, ఇంజనీరింగ్ మాత్రమే విద్య కాదని, విస్తృతంగా ఉన్న విద్యావకాశాలను వివరించాలని కోరారు.
ప్రతీఒక్కరికీ శారీరక ధారుఢ్యం అవసరమని, దీనికోసం ఆటలాడటం, ఎక్సైర్‌సైజులు, యోగా నేర్పించాలని సూచించారు. మన జిల్లాను వెన్నాడుతున్న రక్తహీనత సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా లాంటి వ్యాధుల నివారణకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దీనికోసం ఆరోగ్యం సూత్రాలు, పోషకాహారాన్ని తీసుకోవడం అలవాటు చేయాలని సూచించారు. ప్రభుత్వపరంగా అత్యుతన్న పోషకాహారం, అవసరమైన మందులు సరఫరా జరుగుతోందని, వాటి వినియోగంపై సరైన అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో మహిళలపై ధౌర్జన్యాలు తగ్గడం శుభపరిణామమని పేర్కొన్నారు. బాలురకు కూడా గ్రూపులను ఏర్పాటు చేసి, పలు అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహనా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తామని కలెక్టర్ చెప్పారు.
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి మాట్లాడుతూ, సఖి కార్యక్రమ ఉద్దేశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. బాలికలకు వివిధ అంశాలపై అవగాహనతో పాటు భావ వ్యక్తీకరణ కూడా అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి అమలు వెనుకనున్న లక్ష్యాలను కూడా ప్రజలకు వివరించినప్పుడే, పూర్తిస్థాయిలో సత్ఫలితాలు వస్తాయని చెప్పారు.
మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శాంతకుమారి మాట్లాడుతూ, తమ శాఖాపరంగా సఖి కార్యక్రమాలను, జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలను ఉదాహరణలతో సహా వివరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళా జాతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
యునెసెఫ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ, సఖి గ్రూపులను బలోపేతం చేయడం, రక్షణాత్మక జీవన విధానాలను తెలిపారు. కౌమార బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన అంశాలు, వారి రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలను వివరించారు.
ఉత్తమ సఖి గ్రూపులకు మొమోంటోలను కలెక్టర్ అందజేశారు. పోస్టర్లను ఆవిష్కరించారు. వర్కుషాపులో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.బాలాజి, అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ రామేశ్వరి ప్రభు, యునెసెఫ్ కన్సల్టెంట్ కె.శివకిషోర్, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ అశోక్, పలువురు డాక్టర్లు, వివిధ శాఖల ప్రతినిధులు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.