పడాల రామారావు విగ్రహా ఏర్పాటుకి అనుమతివ్వండి


Ens Balu
21
Rajamahendravaram
2022-12-12 16:14:58

స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు పడాల రామారావు విగ్రహాన్ని స్థానిక గోదావరి గట్టున మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పార్కులో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటు చేసిన అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం ప్రక్కన పడాల రామారావు బస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి నివ్వాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలతను జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కోరారు. ఈ మేరకు ఆమెకు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు మాట్లాడుతూ పడాల రామారావు శతాధిక గ్రంథకర్త, అల్లూరి చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉందని,  అలాగే అల్లూరి అనుచరులు, కుటుంబీకులతో సంబంధం ఉన్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. పడాల రామారావు మాజీ రాష్ట్రపతి వి. వి. గిరితో సత్కరింపబడ్డారని, పడాల రామారావుపై తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ కూడా పూర్తి చేసుకున్నదని పడాల వీరభద్రరావు కలెక్టర్ కు వివరించారు. 

2017లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఆనాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితో నగరపాలక సంస్థ స్థలాన్ని కేటాయించిందని, అదే స్థలములో అల్లూరి విగ్రహం ప్రక్కన పడాల రామారావు బస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచామని పడాల వీరభద్రరావు కలెక్టర్ కు విన్నవించగా అందుకు కలెక్టర్ మాధవీలత సుముఖత వ్యక్తం చేసి నగరపాలక సంస్థకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా 2020లో తంతి తపాలా శాఖ వారు పడాల రామారావు పేరున  విడుదల చేసిన ప్రత్యేక కవర్ ను జ్ఞాపికగా పడాల వీరభద్రరావు కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, కార్యవర్గ సభ్యుడు యర్ర ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.