ఒకరి నేత్రదానంతో ఇద్దరికి చూపునివ్వడం ద్వారా వారి జీవితాల్లో వెలుగును నింపవచ్చని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అన్నారు. నేత్రదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంటులోని ఇండియన్ రెడ్‌క్రాస్ కొత్త భవనంలో, నేత్రదాన కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెప్పారు. కళ్లు లేనివారికి మాత్రమే చూపువిలువ తెలుస్తుందని అన్నారు. ఇలాంటి వారికి చూపునిచ్చేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
నేత్రదానం చేసిన వారినుంచి కార్నియాను సేకరించడానికి ఈ ఐ బ్యాంకు కార్నియా కలక్షన్ సెంటర్ ఉపయోడపడుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ఎల్‌వి ప్రసాద్ లేబరేటరీలో కార్నియాలను భద్రపరచడం జరుగుతోందని చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడే భద్రపరిచి, కంటి శస్త్రచికిత్సలను కూడా చేసే స్థాయికి రెడ్‌క్రాస్ ఎదగాలని ఆకాంక్షించారు. నేత్రదానం చేసిన వారినుంచి కళ్లను తొలగించడం జరగదని, కేవలం కార్నియాను మాత్రమే సేకరించడం జరుగుతుందని చెప్పారు. మరణించిన తరువాత కళ్లను వృధా చేయకుండా, మరొకరి జీవితాలకు వెలుగునివ్వాలని సూచించారు. నేత్రదానం పట్ల భయాన్ని, అపోహలను విడనాడి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావాలని కోరారు.
జిల్లాలో కేన్సర్ నిర్ధారణా శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో చాలామందికి అడ్డపొగ త్రాగడం అలవాటు వల్ల, నోటి కేన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. సర్వైకల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ కూడా కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. ఎంత త్వరగా కేన్సర్‌ను గుర్తించగలిగితే, నయం చేసుకొనే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని అన్నారు. దీనికోసం కేన్సర్ స్కీనింగ్ పరీక్షలు దోహదపడతాయని చెప్పారు. బైపిసి చదివిన విద్యార్థినులకు నైపుణ్య శిక్షణా కేంద్రం ద్వారా ఏఎన్ఎం శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కేన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న రెడ్ క్రాస్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను, బోర్డులను కలెక్టర్ ఆవిష్కరించారు. నేత్రదాన కేంద్రానికి దాతల నుంచి విరాళాలను స్వీకరించారు.