విజయనగరం జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనలో పెద్ద ఎత్తున సహాయం అందించేందుకు ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకొచ్చింది. దేశంలో క్షయవ్యాధి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి టి.బి.ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 300 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలపాటు పౌష్టికాహారం అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ.12.60 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆరు నెలలపాటు 300 మంది రోగులకు ఫుడ్ బాస్కెట్‌లు అందజేసేందుకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ విభాగానికి రూ.12.60 లక్షలు చెక్కు రూపంలో అందజేసింది.
ఈ మేరకు సంస్థ ఎం.డి. కె.నిత్యానందరెడ్డి తరపున చెక్కును అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారికి అందజేశారు. ఆరు నెలలపాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం సరఫరాకోసం రూ.4200 ఖర్చు చేసేందుకు వీలుగా ఈ సహాయం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోరిన మీదట ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 1,000 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు తమ ఫౌండేషన్ ద్వారా రూ.42 లక్షల సహాయం అందిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో 400 మందికి రూ.16.80 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 300 మందికి రూ.12.60 లక్షల సహాయాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందజేశామన్నారు. జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా రోగులకు పౌష్టికాహారం సరఫరాలో పెద్ద ఎత్తున విరాళం అందించిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి కృతజ్ఞతలు తెలిపారు.