జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద మంజూరైన పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేయాలని రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా చీఫ్ ఇంజనీర్ టి.గాయత్రీదేవి అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో అమలవుతున్న జల్ జీవన్ మిషన్-హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించి.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం జల్ జీవన్ మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో కాకినాడ గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎం.శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు.