కాకినాడ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన రెండో దశ నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. కృతికా శుక్లా.. విద్య, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంఈవోలు, ఫీల్డ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి- నాడు నేడు రెండో దశ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా వ్యవస్థల ఏర్పాటు తదితర పనులు మంజూరు చేయం జరిగిందని.. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున త్వరితగతిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అవసరమైన మేరకు సిమెంట్, ఇసుక క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా జిల్లాస్థాయి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలన్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, పంచాయతీరాజ్, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మాణ పనులకు సంబంధించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల్లో పురోగతి చూపించాలన్నారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా సమావేశంలో డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజనం పథకంపైనా చర్చించారు. డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందుకు సంబంధించి ఎంఈఈవోలు సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్ డీఈవో ఆర్‌జే డానియల్ రాజు, ఏపీడబ్ల్యూఐడీసీ ఎస్ఈ కె.లక్ష్మణరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు, వివిధ మండలాల ఎంఈవోలు, వివిధ శాఖల ఫీల్డ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.