రుణాలు పొందిన వారు నిర్మాణాలు మొదలు పెట్టాలి


Ens Balu
9
Bapatla
2022-12-14 10:52:51

గృహాల కోసం రుణం పొందిన వారంతా పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. విజయకృష్ణన్ ఆదేశించారు. జగనన్న కాలనీలలోని గృహనిర్మాణాల పురోగతిపై గృహనిర్మాణ శాఖ, డి.ఆర్.డి.ఎ., మెప్మా అధికారులతో బుధవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఆమె సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీలలో పక్కా గృహాల నిర్మాణాలలో పురోగతి కనిపించాలని కలెక్టర్ చెప్పారు. బాపట్ల జిల్లాలో అధికారులకు నిర్ధేశించిన లక్ష్యాలను  చేరుకోలేకపోవడం ఏమిటని నిలదీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలన్నారు. అధికారులు, బేల్దారి మేస్త్రీలు, లబ్దిదారులతో జగనన్న లేఅవుట్లలోనే సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. లేఅవుట్లలోని ఎన్ని స్థలాలకు రుణం ఇచ్చారో వాటన్నింటిలో గృహనిర్మాణాలను చూపించాలన్నారు. లబ్దిదారుల నుంచి డబ్బులు తీసుకున్న బేల్దారి మేస్త్రీలు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనే అంశాలపై పరిశీలన చేయాలన్నారు. గృహనిర్మాణాలకు అవసరమైన కూలీలను సమకూర్చాలని ఆమె సూచించారు. పక్కా గృహాల నిర్మాణానికి మంజూరు చేసిన రుణాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం మంచిపద్దతి కాదన్నారు.

   జగనన్న కాలనీలలో వనరులు సమకూర్చినప్పటికి పక్కా గృహాల నిర్మాణం జరగకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాపట్ల జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో గృహనిర్మాణాలు పురోగతి లేకపోవడంపై కలెక్టర్ ఆరాతీశారు. అధికారుల పనితీరు మార్చుకోవాలని ఆమె ఆదేశించారు. వేమూరులో ఏర్పాటు చేయాల్సిన గృహనిర్మాణ శాఖ డివిజనల్ ఇంజినీరు కార్యాలయాన్ని నేటికి గుంటూరు జిల్లా తెనాలిలోనే కొనసాగించడంపై కలెక్టర్ మండిపడ్డారు. మూడు రోజుల్లో కార్యాలయాన్ని తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. చీరాల, పర్చూరు, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాలలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడం లేదన్నారు. పనిచేసే అధికారులే జిల్లాలో ఉండాలని, శ్రద్ధలేనివారు ఇతర జిల్లాలకు వెళ్లిపోవచ్చని ఆమె సున్నితంగా మందలించారు. గడిచిన నెల రోజుల్లో 8,664 గృహనిర్మాణాలు లక్ష్యం కాగా ప్రస్తుతం 4,800 గృహాల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించడంపై ఆమె నిలదీశారు. పట్టణ ప్రాంతాలలో గృహనిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. గృహాలు నిర్మించుకునే లబ్దిదారులకు రుణం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. వారంలో రెండురోజులపాటు క్షేత్రపర్యటనలు ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జగనన్న కాలనీలకు సమీపంలో దెబ్బతిన్న పంట కాల్వల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ప్రతిరోజు పక్కాగృహాల నిర్మాణాలపై కలెక్టరేటుకు నివేదిక పంపాలని ఆమె ఆదేశించారు.

     సమావేశంలో డి.ఆర్.డి.ఎ. పి.డి. బి. అర్జున రావు, మెప్మా పి.డి. టి. రవికుమార్, డ్వామా పి.డి. వై. శంకరనాయక్, గృహనిర్మాణ శాఖ ఇంజినీర్లు, డి.ఆర్.డి.ఎ. ఏరియా కోఆర్డినేటర్లు, మున్సిపల్ కమిషనర్లు, మెప్మా సిటీ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.