ఇందన పొదుపు అందరి బాధ్యత అని, ఇంధనాన్ని ఆదా చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంధన పొదుపు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరచేందుకు కలెక్టరేట్‌లో ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. బాలాజీ చెరువు కూడలి వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంధన పొదుపు చర్యల సమాచారంతో ముద్రించిన ప్రచార పత్రాలను కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఇంధన పొదుపు అంశంపై పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించేందుకు ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. అవసరం మేరకు మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని, రాయితీపై లభించే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల విద్యుత్ ఆదా అవుతుందని.. అందుకే ఈ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లలో వీలైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేసే స్టార్ రేటెడ్ ఉపకరణాలను ఉపయోగించాలన్నారు. సుస్థిర భవిష్యత్ కోసం ఇంధన పొదుపు అత్యావశ్యకమని.. భావితరాల భద్రత కోసం ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇంధనాన్ని ఆదా చేయాల్సి ఉందని.. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డా. కృతికా శుక్లా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఈఈ జి.ప్రసాద్, డీఈఈలు టి.విష్ణుమూర్తి, ఎల్ఎల్ఎన్ కిరణ్; ఏఈలు, విద్యుత్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.