భావితరాలకు చక్కని పర్యావరణం అందించేందుకు ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం భీమవరం ప్రకాశం సబ్ సెంటర్ లో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, విద్యుత్ పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు .ముందుగా ఇంధన పొదుపుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి ఇంధనాన్నిపొదుపుగా వినియోగించుకుంటామని అక్కడకు హాజరైన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు .
అనంతరం మాట్లాడారు. భారతదేశ పౌరునిగా ప్రతి ఒక్కరూ విద్యుత్ వృధాను అరికట్టి సరైన రీతిలో వినియోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నారు.
అలాగే క్షేత్రస్థాయిలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పలు రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ గృహ వినియోగదారులు ,పరిశ్రమ దారులు పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ఇతర ఇంధన వనరులను ఉపయోగించడంలో కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతిరోజు పెట్రోల్ తో వాహనం నడుపుతున్నామని దాంతోపాటు సైకిల్ని కూడా వినియోగిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ఎల్ఈడి దీపాలు, సోలార్ వంటి వాటిని వినియోగించు కోవాలన్నారు. ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని, అలాగే క్షేత్రస్థాయిలో ప్రతి సచివాలయం పరిధిలో కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
ప్రజలందరూ కూడా వీటిపై అవగాహన కలిగి ఇంధన వనరుల ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ దాసిరాజు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వి. ఆదిశేషు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ కాన్, డిఈలు ఎం. రాజగోపాల్ ,పి .రాంబాబు,ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.