ఇ-సర్వీసుల్లో విజయనగరం అగ్రస్థానం..
Ens Balu
0
Vizianagaram
2020-09-23 15:34:45
వివిధ అంశాల్లో తన ప్రత్యేకతను చాటుకొని అగ్రస్థానంలో నిలుస్తున్న విజయనగరం జిల్లా, ఇ-సర్వీసుల్లో కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇ-రిక్వెస్టు ద్వారా వచ్చిన ధరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం ద్వారా ఈ ఘనత జిల్లాకు దక్కింది. అన్ని శాఖలకు సంబంధించి, వచ్చిన ధరఖాస్తుల్లో, 94.93శాతాన్ని పరిష్కరించి, సకాలంలో ఆయా సేవలను ప్రజలకు అందించడం ద్వారా అగ్రస్థానాన్ని సాధించగా, రెవెన్యూ పరమైన అంశాల్లో కూడా 93.37శాతం పరిష్కరించడం ద్వారా తాజాగా జిల్లాకు ఫస్ట్‌ర్యాంకు దక్కింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం వివిధ రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వాటిని నిర్ణీత కాలపరిమితిలో ప్రజలకు అందించాల్సి ఉంది. దాని ప్రకారం పౌర సరఫరాలు, రెవెన్యూ, ఇంధనం, రవాణా, మున్సిపల్, పంచాయితీరాజ్, యువజన సేవలు, వ్యవసాయం, మార్కెటింగ్, పశు సంవర్థకశాఖ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, ఓట్ల నమోదు, సమాచారశాఖ, బిసి సంక్షేమం, సాంఘిక సంక్షేమశాఖ, కార్మికశాఖ, వైద్యారోగ్యశాఖ తదితర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల్లో ఇప్పటివరకు 4,56,732 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,33,592 ధరఖాస్తులను పరిష్కరించడంతో, 94.93 శాతం సగటుతో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప, కృష్ణా జిల్లాలు మన తరువాత స్థానాల్లో నిలిచాయి.
రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా తాజాగా విజయనగరం జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించి ఇప్పటివరకు 2,35,435 ధరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటికే 2,19,845 ధరఖాస్తులను పరిష్కరించి, 93.37శాతం సగటుతో మొదటి స్థానంలో జిల్లా నిలిచింది. విశాఖపట్నం, కృష్ణా, వైఎస్ఆర్ కడప జిల్లాలు మన తరువాత స్థానాలను సాధించాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ నిరంతరం ఇ-రిక్వెస్టులపై సమీక్షించడం, ఆయా శాఖలు స్పందించి వాటిని సకాలంలో పరిష్కరించడం ద్వారా విజయనగరం జిల్లాకు ఈ గౌరవం దక్కింది.