శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 21లోగా తొలగింపులు, చేర్పులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఎస్ఆర్-2023, శాసన మండలి పట్టబద్రుల ఎన్నికలు, తొలగింపులు, చేర్పులు, ఫోటో గ్రఫీ సిమిలరీ ఎంట్రీలు, ఫారం-6బి(ఆధార్ లింక్) లపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తో కలిసి ఆయన సమీక్షించారు. వారం రోజుల్లో దృష్టి సారించి ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్, ఎన్నికల డిటిలతో టెలీకాన్ఫరెన్స్ లో ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదుపై సమీక్షించారు. వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
సమయం తక్కువగా ఉన్నందు వలన తొలగింపులు, చేర్పులు త్వరితగతిన చేపట్టాలన్నారు. ప్రాసెసింగ్ లో ఉన్న వాటిని తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. బిఎల్ఓ లతో సమీక్షించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి తొలగింపులు, చేర్పులు చేయాలన్నారు. మండలాల వారీగా తొలగింపులు, చేర్పులు, ఫోటో గ్రఫీ సిమిలరీ, ఫారం-6బిలపై ఆయన సమీక్షించారు. ఫారం- 6బి సేకరణలో ఎక్కువ పెండింగ్ లో ఉన్నాయని, మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేర్పులు, తొలగింపులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, ఆర్డీఓలు బి. శాంతి, సీతారామమూర్తి, ఉప కలెక్టర్లు జి. జయదేవి, సవరమ్మ, జడ్పీ సీఈవో వెంకటరామన్ టెలీకాన్ఫరెన్స్ లో తహసీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.