ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని రాష్ట్ర పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తణుకు కోర్టు ఆవరణలో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని మంత్రి తెలిపారు. ఆయన గాంధీజీ స్ఫూర్తితో సబర్మతి ఆశ్రమంలో చేరి
స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన దేశ భక్తుడన్నారు.
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం మద్రాసులో 1952 అక్టోబర్ 19న నిరాహారదీక్ష ప్రారంభించారని, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనలో 1952 డిసెంబర్ 15న అసువులు బాసారని తెలిపారు. ఆంధ్రుల కోసం ఆయన చేసిన త్యాగానికి గాను ఆయనకు "అమరజీవి" బిరుదు ఇచ్చారని మంత్రి తెలియచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు ను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ, ఆయన అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి దేశానికి తమ వంతు సేవ చేయాలని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.