బోగాపురం ఎయిర్ పోర్టు 2023కి పూర్తికావాలి..
Ens Balu
2
Vizianagaram
2020-09-23 15:57:09
విజయనగరం జిల్లా రానున్న రోజుల్లో జిల్లా ఆర్ధికాభివృద్ధి సాధనలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం చోదకశక్తి కానుందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఇదని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో 2023 నాటికి పూర్తిచేయాలని కృతనిశ్చయంతో వుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి కావాలంటే నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాల్సి వుందన్నారు. దీనిని దృష్టిలో వుంచుకొని భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సంకల్పించామన్నారు. జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం నగరానికి వచ్చిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవన్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, రెవిన్యూ, భూసేకరణ అధికారులతో సమావేశమై భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ, పునరావాసంపై సమీక్షించారు.
జిల్లా అభివృద్ధితోనే కాకుండా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో కూడా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని, అందువల్ల దీని ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకొని భూసేకరణ, పునరావాస పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. భూసేకరణలో భాగంగా గుర్తించిన ప్రభుత్వ భూమిని ముందుగా నిర్మాణ పనులు చేపట్టనున్న జి.ఎం.ఆర్. సంస్థకు అప్పగించాలన్నారు. ఎయిర్ పోర్టుకు అవసరమైన 2,750.78 ఎకరాల భూమిలో ఇప్పటివరకు 2383.02 ఎకరాల భూసేకరణ పూర్తిచేసి అప్పగించారని, ఇంకా అప్పగించాల్సి వున్న 71 ఎకరాల ప్రభుత్వ భూమిని పదిరోజుల్లో ఎయిర్ పోర్టు నిర్మాణ సంస్థకు అప్పగించాలని సూచించారు. భూసేకరణ యూనిట్ వారీగా సేకరించిన, సేకరించాల్సి వున్న జిరాయితీ భూములు, ఎసైన్డు భూములు, ప్రభుత్వ భూములు, కోర్టులో వున్న రిట్ పిటిషన్ల వివరాలపై ఆయా భూసేకరణ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ భూమిని నిర్ణీత ప్రక్రియను పూర్తిచేసి అప్పగించే బాధ్యత రెవిన్యూ డివిజనల్ అధికారిదేనని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లకు భూసేకరణపై సంపూర్ణ అవగాహన వుందని, వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారని, భూసేకరణ అధికారులు కూడా తమ పరిధిలో వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.