ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మదిలో చిరస్థాయిగా మిగిలారని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కితాబిచ్చారు. గురువారం పొట్టి శ్రీరాములు 70వ వర్థంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు శ్రీరాములు అని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు అని, ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన పేరుతో జిల్లా ఉండటం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయన్నారు. అటువంటి మహనీయుడుని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలసిన తరుణమిదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.