ఇచ్చాపురంలో అక్షయపాత్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం తరపున కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం వద్ద గల అక్షయపాత్రను కలెక్టర్ శనివారం సందర్శించారు. శ్రీకాకుళం చుట్టుపక్కల గల నాలుగు మండలాల పరిధిలోని 24వేల మంది విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న సంగతి విదితమే. ఇదేవిధంగా ఇచ్చాపురంలో కూడా అక్షయపాత్రను ఏర్పాటుచేసి చుట్టుపక్కల మండలాల్లోని విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందుకు ఇచ్చాపురంలో అన్నిటికీ అనువుగా ఉండే ప్రాంతంలో అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ అక్షయపాత్ర మేనేజర్ పి.వెంకటరాజుకు తెలిపారు.
అయితే నిర్మాణం, అవసరమైన యంత్ర సామగ్రిని అక్షయపాత్రే సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. అక్షయపాత్రలోని వివిధ విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆహారం సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఇటీవల విద్యార్థుల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, ఇకపై
అటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇచ్చాపురంలో అక్షయపాత్ర నిర్మాణంపై యాజమాన్యంతో మాట్లాడి తమకు తెలియజేయాలని కలెక్టర్ మేనేజర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యా శాఖాధికారి జి.పగడాలమ్మ, అక్షయపాత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.