చిన్న పిల్లలతో యాచకత్వం చేయిస్తే కఠిన చర్యలు


Ens Balu
12
Srikakulam
2022-12-17 10:40:55

పిల్లలతో యాచకత్వాన్ని ప్రోత్సహించే వారిపై  కఠిన చర్యలు తప్పవని కార్యదర్శి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు హెచ్చరించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన స్టేట్ ప్లాన్ అఫ్ యాక్షన్ కి అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, న్యాయ సేవా సదన్ లో పిల్లలలో యాచకత్వం నిరోధించే అంశముపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ, పిల్లలలో యాచకత్వాన్ని ప్రోత్సహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పిల్లలలో యాచకత్వాన్ని నిర్మూలించి వారిని మంచి 
బాధ్యత గల భావి భారత పౌరులుగా తయారు చేసే బాధ్యత భారత దేశ పౌరులు అందరి పైన ఉందన్నారు. యాచకత్వం చేసే పిల్లలు ఎవరైనా కనిపిస్తే సాధారణ పౌరులు కూడా పోలీసులకి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి గాని వెంటనే సమాచారాన్ని ఇచ్చే భాద్యత తీసుకోవాలన్నారు.

 భారత దేశ భవిష్యత్తు బాలల చేతుల్లోనే ఉందని గుర్తించాలన్నారు. చాలామంది పేదరికం సాకు గా చెప్పి పిల్లల్ని యాచకత్వంలోకి దించుతున్నారని ఇటువంటి వారికి ప్రభుత్వం నిర్వహిస్తు్న్న అనేక శిక్షణ కార్యక్రమాలు ద్వారా ఆర్థిక స్వావలంబనకు సహాయం అందించవచ్చునని తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా 
అందిస్తున్న అనేక శిక్షణ కార్యక్రమాల్లో ఇలాంటి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి వారిని ఆర్థింగా నిలదొక్కుకునే స్థాయికి తేవడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దిశా డిఎస్పీ వాసుదేవరావు, డిప్యూటీ లేబర్ కమిషనర్ ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.వి.రమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు  శ్రీలక్ష్మి, ఎల్సిపిఓ తలే లక్ష్మణరావు, న్యాయవాది ఇందిరా ప్రసాద్ తోపాటు శ్రీకాకుళం జిల్లాలోని స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, అర్బన్ సెక్రటేరియట్ ల లోని ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు పొదుపు సంఘాల సూపర్వైజర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.