జనవరి 3 వ తేదీ నాటికి ఓటర్ల జాబితా సిద్ధం కావాలని ఓటర్ల జాబితా పరిశీలకులు పి.భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్త ఓటర్లు, మార్పులు చేర్పులు పూర్తి చేయాలన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి సవరణలు చేయాలని, ఓటర్లకు నమ్మకం కలిగించేలా జాబితా సిద్ధం చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు సమర్పించిన రికార్డులను తరిచి చూడాలన్నారు. ఓటర్లలో స్త్రీ పురుష నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి అన్ని పోలింగ్ కేంద్రాలలో రాష్ట్రస్థాయి నిష్పత్తికి దాదాపు సమానంగా ఉండాలన్నారు. కొత్తగా చేరిన ఓటర్లు, తొలగింపు చేయవలసిన ఓటర్లను గుర్తించిన తరువాత దామాషా పద్ధతిని పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో అనుమానం ఉన్నచోట్ల క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల దాటిన కొత్త ఓటర్లు సుమారు 15 వేలు వచ్చారని, తొలగించవలసిన ఓట్లు సుమారు పదివేల వరకు ఉన్నాయన్నారు. ఫారం 7 క్లైములు 1208 కాగా 99 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. మృతి చెందిన ఓటర్లు, వలసపోయిన వారిని గూర్చి స్పష్టమైన ఆధారాలతో సరి చూసి తుది జాబితా తయారు చేస్తున్నామని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి, జిల్లాలోని చోడవరం మాడుగుల అనకాపల్లి ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం నియోజకవర్గాల ఎన్నికల అధికారులు ఆయా నియోజకవర్గాలలోని మండలాల తాశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.