రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డిగ్రీ విద్యార్ధుల ఇంటర్న్ షిప్‌లో భాగంగా రేడియో అల 90.8 ఎఫ్.ఎం ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న కాకినాడ పిఠాపురంరాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాల జర్నలిజం విద్యార్ధులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ పనితీరును అధ్యాయనం చేసారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ఉన్న జిల్లా కలెక్టరు డా.కృతికాశుక్లా ను విద్యార్థులు కలిసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడుతూ జర్నలిజం కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. సోషల్ మీడియా విస్తృతంగా విస్తరిస్తున్నందున జర్నలిజం విద్యార్ధులకు ఉపాధి అవకాశాలకు కొదవలేదని ఆమె తెలిపారు. జర్నలిజం విద్యార్ధులు నైతిక విలువలతో కూడిన పనితీరును కనపరచి మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని కలెక్టరు కృతికా శుక్లా ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రేడియో అల 90.8 ఎఫ్.ఎం స్టేషన్ డైరెక్టర్ ఎం.సత్య, యునైటెడ్ న్యూస్ నెట్‌వర్క్ డైరెక్టర్ జి.ఖ్యాతీశ్వరి తదితరులు పాల్గొన్నారు.