కిసాన్ రైల్ ఛార్జీలు 50% తగ్గించాలి..


Ens Balu
3
Anantapur
2020-09-23 18:47:58

కిసాన్ రైల్ ద్వారా అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్ కు చేరవేసే అనంత ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలను 50 శాతం  తగ్గించాల్సిందిగా గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారికి మంగళవారం లేఖ ద్వారా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు. గుంతకల్లు డి ఆర్ ఎంకు పంపిన లేఖ నందు కిసాన్ రైల్ ప్రవేశపెట్టడంతో పాటు ఈనెల 9వ తేదీన మరియు 19వ తేదీన అనంత ఉద్యాన ఉత్పత్తులను న్యూఢిల్లీలోని అజాద్పూర్ మండికి తరలించడంలో రైల్వే శాఖ ద్వారా అందించిన సహాయ సహాకారాలకు జిల్లాలోని రైతులు మరియు జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ నేపథ్యంలో కిసాన్ రైల్ ద్వారా ఒక టన్ను  ఉద్యాన ఉత్పత్తులు ఢిల్లీకి చేరవేసేందుకు 5136/- రూపాయల రవాణా చార్జీలు  చెల్లించడంతో పాటు వాటికి అదనంగా ఉద్యాన ఉత్పత్తుల లోడింగ్ మరియు అన్ లోడింగ్ ఖర్చులు  రైతులకు భారంగా అయ్యాయన్నారు. కిసాన్ రైల్ ద్వారా ఒక టన్నుకు రూ. 5136 / - లు చొప్పున 23 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 15 వ్యాగన్స్  ద్వారా 345 మెట్రిక్ టన్నులను నెలలో నాలుగు పర్యాయాలు కిసాన్ రైల్ ద్వారా పంపేందుకు ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుండి మే 2021 వరకు 32 సార్లు కిసాన్ రైల్ నడిపే విధంగా ప్రతిపాదించారన్నారు.  టన్నుకు రూ 5136/- ల చొప్పున  345 మెట్రిక్ టన్నులకు రూ.17.71 లక్షల రవాణా చార్జీలను రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 32 సార్లు కిసాన్ రైల్ ద్వారా 11,040 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను ఢిల్లీ మార్కెట్ కి చేరవేసేందుకు 567 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఇందులో 50 శాతం రవాణా చార్జీలు అనగా రూ.283.50 లక్షలు  రైల్వే శాఖ ద్వారా భరిస్తే, మిగిలిన రూ.283.50 లక్షలను రైతులు భరిస్తారన్నారు . రైల్వే శాఖ ద్వారా భరించే రవాణా ఛార్జీల మొత్తాలను కేంద్ర ఆహార తయారీ మంత్రిత్వశాఖ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం' నుండి గానీ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన వనరులు నుండి కానీ చెల్లించేందుకు చర్యలు తీసుకుని రైతులకు సహాయం చేయవలసిందిగా   జిల్లా కలెక్టర్ గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ కు  లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.