పార్వతీపురం మన్యం జిల్లాలో ఆక్వా కల్చర్ పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా కల్చర్ అథారిటీ (ఏపి ఎస్ ఎడిఎ) చట్టం 2020 అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జరిగింది. జిల్లాలో గల అన్ని నీటి వసతులను వినియోగించు కోవాలని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులు, మత్స్య రంగంలో అర్హులైన అనుభవం ఉన్న దేశీయ మత్స్యకారులను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా కల్చర్ అథారిటీ (ఏపి ఎస్ ఎడిఎ) చట్టం 2020 ద్వారా చేపల ఉత్పత్తి, సరఫరా చేసేవారు, చేపల మార్కెటింగ్ చేసే వారికి ఏపి ఎస్ఎడిఎ నిబంధనల మేరకు లైసెన్సులు జారీ చేయాలని వివరించారు. ఇందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు జరిగాయని ఆయన చెప్పారు. మండల స్థాయిలో తహశీల్డార్లు అధ్యక్షులుగా ఉంటారని ఆయన అన్నారు. కమిటీలకు అందిన దరఖాస్తులను ఇ - మత్స్యకార్ లాగిన్ లో పెట్టాలని, ఇందుకు లాగిన్, పాస్ వర్డ్ లను ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పి.సీతారాం, జిల్లా భూగర్భ జలాల అధికారి ఏ. రాజశేఖర రెడ్డి, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్. అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.