గిరిజనులు పండించే పంటలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించుటకు ప్రభుత్వం నుండి కావలసిన సహకారం కొరకు ప్రణాళికలు తయారుచేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరు కార్యాలయంలో ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారులు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ, డి.ఆర్.డి.ఎ. అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ గిరిజనులు వారు పండించిన పంటలను తక్కువ రేటుకే దళారులకు అమ్ముకుంటున్నారని, వారి పంటలకు ఎక్కువ ధర లభించుటకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి గల అన్ని అవకాశాలను అన్వేశించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల నిర్వహణలో లోపాలు, వాటి అనుసంధానత, పనితీరు మెరుగుపరచుటకు తీసుకు రావలసిన సంస్కరణలను గూర్చి తెలియజేయాలన్నారు.
పసుపు, ఫైనాపిల్, చింతపండు, జీడిమామిడి పంటలలో ఇప్పటికే కొన్ని ఉత్పత్తులను తయారుచేస్తున్నప్పటికి, మరిన్ని ఎక్కువ రకాల ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. మార్కెటింగు ప్రణాళికకు సంవత్సరంలో ఏ పంట ఎప్పుడు వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది వివరాలతో కేలండరు తయారుచేసి అమలుచేయాలన్నారు. జీడిపప్పు, తృణధాన్యాలను కలిపి బిస్కట్స్, న్యూట్రిషన్ పౌడరు, చిరుతిండిపదార్దాలు తయారు చేయవచ్చునని, పసుపుతో ఆయుర్వేద, సౌందర్య ఉత్పత్తులు, అరటిపంట వ్యర్థాలతో పర్యావరణ హితమైన బోజనం ప్లేట్లు, కప్పులు తయారు చేయవచ్చునని జిల్లా కలెక్టరు తెలిపారు. చిన్న యూనిట్లు ఏర్పాటుకు ఆర్థిక సహాయం, మార్కెటింగు, బ్రాండింగు, ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ప్రచారం కొరకు ప్రభుత్వం నుండి కావలసిన సహకారం కొరకు ప్రణాళికలు తయారుచేసి పంపించాలని తెలిపారు.
ఫైనాపిల్ ఉత్పత్తులు తయారీకి సీతంపేటలో అయిదు కోట్ల రూపాయలతో ప్రాసెసింగు యూనిట్ నెలకొల్పుటకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సీతంపేట ఐ.టి.టి.ఎ. ప్రోజెక్టు అధికారి బి. నవ్య తెలిపారు. పార్వతీపురం ప్రోజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ ప్రస్తుతం మార్కెటింగు చేస్తున్న ఉత్పత్తుల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, సహాయ ప్రోజెక్టు అధికారులు పాల్గొన్నారు.