నిర్మాణ పనులకు సిమెంట్ సరఫరా కీలకం..


Ens Balu
3
కలెక్టరేట్
2020-09-23 18:59:48

ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిమెంట్   సకాలంలో  అందించడమే కీలకమని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో ఈ విషయమై ఆయన సమీక్ష నిర్వహించారు.  ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు కుదుట పడ్డాయని, రవాణా కు ఎటువంటి ఆటంకాలు లేనందున సిమెంటును సకాలంలో అందజేయాలన్నారు. సిమెంట్ కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను నిర్మాణం జరిగే చోటికి చేరవేయ వలసిన బాధ్యత కంపెనీలకు ఉండదని స్పష్టం చేశారు. సిమెంట్ సరఫరా లేనట్లయితే పనులు సాగక నిర్మాణ కార్మికులకు, ప్రభుత్వ అధికారులకు ఎంతో సమయం వృధా అవుతుందన్నారు. ఆయా కంపెనీలతో చెల్లించవలసిన మొత్తాలను ఇప్పటికే చెల్లిస్తూ ఉన్నామని వీలైనంత వేగంగా పూర్తి చెల్లింపులు  చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన అంగన్వాడీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, గృహ నిర్మాణం, నీటి పారుదల పథకాలు, రోడ్ల నిర్మాణం మొదలైన వాటిని అన్నింటికీ పెద్ద ఎత్తున సిమెంటు అవసరం అవుతుందన్నారు. సిమెంట్ కంపెనీలు తమ బాధ్యతగా తమకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సరఫరా చేసి అభివృద్ధి పథకాలకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ పర్యవేక్షక ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ  రవికుమార్ గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు జయ రామాచారి, నీటిపారుదల శాఖ తదితర  శాఖల ఇంజనీరింగ్ అధికారులు వివిధ సిమెంట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.