ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీపై అధికారులు దృష్టి పెట్టి, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
కాకినాడల కలెక్టరు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా.. డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి డిఎస్ సునీతలతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 43 అర్జీలు అందగ వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో రెవెన్యూ, భూమి సమస్యలు, సంక్షేమ పథకాల, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, గృహం, పింఛన్ మంజూరు వంటి అంశాలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టరు కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతినెల ఆఖరు శుక్రవారం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, నాణ్యతతో కూడిన నివేదికతో గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.