ప్రపంచంలోనే ఎంతో పేరున్న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి వారి పరువును దేవదాయశాఖ కావాలనే తీసి రోడ్డున పడేసేలా చేస్తున్నది. దానికి దేవస్థాన అధికారులు తోడవ్వడంతో అది కాస్త తరచూ వార్తలకెక్కుతూ స్వామివారి గౌరవానికి, కీర్తికి బంగం కలిగేలా చేస్తున్నది. పన్ను ఎగవేత దారుల జాబితాలోకి ఇపుడు సత్యదేవుని ఇల్లు(ఆలయం) వచ్చి చేరింది. తరచూ నోటీసుల తీసుకుంటూ పన్ను ఎగవేతదారునిగా సత్యదేవుడు మచ్చపడ్డాడు. ఎక్కడైనా దేవతా మూర్తులు భక్తుల నుంచి ముడుపులు అందుకుంటారు. కానీ సత్యదేవుడు మాత్రం పన్ను ఎగవేత దారునిగా ఏడేళ్లుగా పన్ను బకాయి నోటీసు అందుకుంటూనే ఉన్నాడు.. తామన్నీ నిబంధనల ప్రకారం చేస్తామని బీరాలు పోయే దేవాదాయశాఖ, ఇందులోని అధికారులు 2015-16 నుంచి 2022-23 వరకూ రూ.81.92 లక్షల ఇంటిపన్ను ఎగ్గొట్టారు.
పంచాయతీ నుంచి ఎన్ని నోటీసులు ఇస్తున్నా అన్నవరం దేవస్థానం అధికారులుగానీ, రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లుగానీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. స్వామి వారికి వచ్చే ఆదాయం నుంచి కొద్ది కొద్దిగా చెల్లించినా సత్యదేవుని ఆలయం ఇంటిపన్ను బకాయి తగ్గేది. పన్నుఎగ్గొట్టింది సరికదా 2016లో హై కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకుంది దేవదాయశాఖ. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రముఖ దేవస్థానాలు టెంపుల్ సిటీ, దాని పరిధిలోకి వచ్చే పంచాయతీలకు క్రమంతప్పకుండా ఇంటి పన్ను చెల్లిస్తుంటే స్వామివారి పరువును కోర్టు వరకూ తీసుకెళ్లారు అన్నవరం దేవస్థానం అధికారులు.
అంతేకాదు దేవస్థాన పరిధిలోకి వచ్చే పంచాయతీకి గానీ, ఇక్కడి సర్పంచ్ గానీ, ప్రోటోకాల్ కూడా ఇవ్వడం మానేశారు. ఇదేమంటే తమ శాఖ ముఖ్య అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ధీమాగా సమాధానం చెబుతున్నారు. ఓ పక్క సీఎం వైఎస్.జగన్మోహ నరెడ్డి నిష్పక్షపాతంగా పరిపాలన చేపట్టాలని అన్ని 75 ప్రభుత్వశాఖల అధిపతులకు నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతున్నా.. దేవాదాయశాఖ అధికారులు మాత్రం అటు సీఎం మాటను పరిగణలోకి తీసుకోకుండా..ఇటు సత్యదేవుని పరువుకి బంగం కలిగే విధంగా పన్నులు చెల్లించకుండా వ్యవహరిస్తున్నారు. నిత్యం అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో టెండర్లు, రూమ్ లు బుకింగ్, దర్శనాలు అన్నీ దేవస్థానం అధికారులు, సిబ్బంది అందరూ అడ్డదారిలో అస్మదీయులకు ఆమ్యామ్యాలు పుచ్చుకొని చాలా గౌరవంగా చేస్తారనే అతిచెడ్డ మంచి పేరు ఉంది. తీరా పరిపాలనా వ్యహరాల విషయంలో మాత్రం తమ పై అధికారులు చెబితే తప్పా... ఆ ఒక్కటీ అడక్కు అంటూ భీష్మించుకు కూర్చుకుంటున్నారు.
దేవస్థాన ఇంటి పన్ను బకాయి విషయం మంత్రి దృష్టికి
అన్నవరం దేవస్థానంలో సుమారు ఏడేళ్ల నుంచి పేరుకుపోయిన రూ.18లక్షల ఇంటి పన్ను బయిలు దేవస్థానం చెల్లించకపోవడంతో ఈ విషయాన్ని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణకు విన్నవించినట్టు అన్నవరం సర్పంచ్ కుమార్ రాజా మీడియాకి తెలియజేశారు. ఆ తరువాత ఇదే విషయమై దేవాదాయశాఖ అధికారులను మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినా నేటికీ అతీ గతీ లేదని పేర్కొన్నారు. స్వామివారి ఇంటి పన్ను నోటీసులు పదే పదే ఇవ్వడాని బాధ కలుగుతుందన్నారు. తిరుపతి లాంటి దేవస్థానాలు దేవస్థాన పరిధిలోకి వచ్చే గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తున్న విషయాన్ని ఉటంకించారు. అదే సమయంలో ఇటు దేవస్థాన ఈఓ కూడా తమ శాఖ నుంచి ఆదేశాలొస్తే అమలు చేసి ఇంటి పన్ను బకాయిలు కొద్ది కొద్దిగా తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
రాజ్యం బాగుండాలంటే రాజు పరిపాలన బాగుండాలంటారు..అదేవిధంగా దేవస్థానాలు అభివృద్ధి చెందాలన్నా, పేరు ప్రఖ్యాతలు పెరగాలన్నా దేవాదాయశాఖలోని ముఖ్య అధికారుల పరిపాలన సక్రమంగా ఉండాలి. లేదంటే దేవుళ్ల ఇళ్లకు, దేవస్థానాలకు ఇలా అన్నవరం గ్రామ పంచాయతీలు జారీచేసినట్టు ఇంటి పన్ను నోటీసులు జారీచేయించుకొని.. దేవుడే తప్పుచేసినట్టు అధికారు వ్యవరించే తీరుకి భక్తుల ముందు పన్ను ఎగవేత దారునిగా రోడ్డుపైకి రావాల్సి వస్తుంది. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు స్పందించి దేవుని ఆలయం ఇంటి పన్ను బకాయిలు అన్నవరం పంచాయతీకి చెల్లించడంతోపాటు, గ్రామాభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు.