రోజుకో వార్డు సచివాలయాన్ని సందర్శించాల్సిందే..


Ens Balu
3
జివిఎం ప్రధాన కార్యాలయం
2020-09-23 19:22:57

జి.వి.ఎం.సి. పరిధిలో ఉన్న వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు సత్వరమే అందించాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన ఆదేశిం చారు. బుధవారం జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, వార్డు స్థాయి, జోనల్ స్థాయి ప్రత్యేక అధికారులు, వార్డు కార్యదర్శులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వార్డు కార్యదర్శులు నిరంతరం సచివాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జోనల్ కమిషనర్లు ప్రతీరోజూ ఒక సచివాలయాన్ని సందర్శించి తనిఖీ చేసి నివేదికను పంపాలన్నారు. ప్రతీ సచివాలయములలో కార్యదర్శులు, వాలంటీర్ల హాజరు పట్టికను, రోజువారి కార్యకలాపాలను  తెలిపిన డైరీను పరిశీలించి తెలుసుకోవాలన్నారు. వీరితో పాటు ప్రత్యేక అధికారులు కూడా సచివాలయాలు సందర్శించి తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలైన ప్రధానమంత్రి స్వానిధి, వై.ఎస్.ఆర్. ఆసరా, జగనన్న తోడు, వై.ఎస్.ఆర్. చేయూత, విద్యా దీవన వంటి కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోవాలన్నారు. ఇప్పటివరకు, జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయాల్లో, జోనల్ స్థాయిలో ప్రజల నుండి విజ్ఞప్తులు,  ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, ఇకపై వాటిని ఆయా సచివాలయాల పరిధిలోనే తీసుకోవాలన్నారు. ప్రజల విన్నపాలు, సేవలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ అంశంపై వార్డు స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి జోనల్ కమిషనర్లు, జోనల్ స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు కమిషనర్ కు నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్లు, జి.వి.ఎం.సి. విభాగాధిపతులు, జోనల్ స్థాయి ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.