సమస్యల అర్జీలపై సత్వరం స్పందించాలి..


Ens Balu
2
Parvathipuram
2020-09-23 19:48:10

రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ద్వారా త్వరితగతిన, మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఒక మంచి సంకల్పంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఆర్. మహేష్ కుమార్ పేర్కొన్నారు.  జాయింట్ కలెక్టర్ తన పర్యటనలో భాగంగా బుధవారం పార్వతీపురం మండలం నర్శిపురం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ముందుగా సచివాలయంలో ప్రజలకు అందజేస్తున్న సేవలకు సంబంధించిన వివరాలు రికార్డులు పరిశీలించారు, గ్రామంలో ప్రజలు వారు కోరే సమాచారం నిర్దేశించిన సమయంలోనే అందజేయాలన్నారు. అలాగే రికార్డులు సకాలంలో నిర్వహించాలన్నారు. గ్రామ సచివాలయంలో  విధులు నిర్వహిస్తున్న సిబ్బంది  బయోమెట్రిక్ తప్పక వినియోగించాలని మండల అభివృద్ధి అధికారికి ఆదేశించారు.  ప్రభుత్వము అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు సత్వరం లబ్ధి దారులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయం సిబ్బందికి అభివృధి కార్యక్రమాలు గురించి సూచనలు సలహాలు అందించారు. ప్రతిరోజూ  కార్యాలయంలో చేపడుతున్న పనుల వివరాలకు సంబందించిన సమాచారాన్ని తదితర సమాచారాన్ని అందరికి అందుబాటులో ఉండే విధంగా నోటీసు బోర్డులో డిస్ప్లే చేశారా అన్న వివరాలు పరిశీలించారు. ఈ పర్యటన కార్యక్రమంలో పార్వతీపురం ఎం.పి.డి. ఓ కృష్ణా రావు, సచివాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.