ఈసేవ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి..
Ens Balu
1
Nellimarla
2020-09-23 19:52:36
విజయనగరం జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ సచివా లయ కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయ ఇ-సేవ దరఖాస్తుల పరిష్కరించి సేవలు అందించడంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, దీనిని నిలిపేవిధంగా అన్ని సచివాలయాల్లో కార్యదర్శులు పనిచేయాలన్నారు. యువత అధికంగా సచివాలయ ఉద్యోగులుగా వున్నారని, అందరూ పనివిధానం తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కలెక్టర్ బుధవారం మధ్యాహ్నం నెల్లిమర్ల నగర పంచాయతీలోని ఇందిరా నగర్‌లో వున్న నాలుగో నెంబరు వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో కార్యదర్శులు నిర్వహిస్తున్న విధులను గురించి తెలుసుకున్నారు. ఇ-సేవ దరఖాస్తుల పరిష్కారంపై ఆరా తీశారు. ఇక్కడ 94 శాతం మాత్రమే పరిష్కారం కనిపిస్తోందని, జిల్లాలో చాలాచోట్ల 98 నుండి 99 శాతం వరకు దరఖాస్తులు పరిష్కారం జరిగాయన్నారు. ఇక్కడి సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. బియ్యం కార్డు గల కుటుంబాలను వై.ఎస్.ఆర్.బీమా పథకంలో నమోదు చేయడంలో సాధించిన ప్రగతిపై తెలుసుకున్నారు. కొన్ని పేర్లకు సంబంధించి స్థానికంగా నివాసం లేనట్లు తేలిందని సచివాలయ కార్యదర్శులు పేర్కొనగా, ఆయా కుటుంబాల పేరుతో వున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయించి వారు ఎక్కడ నివాసం వుంటున్నదీ తెలుసుకున్నారు. నగర పంచాయతీ పరిధిలో జరజాపుపేట వార్డు సచివాలయం దరఖాస్తుల పరిష్కారంలో వెనుకబడి వున్నట్టు తెలుస్తోందని, ఇక్కడ ప్రగతి కనిపించేలా చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ అప్పలనాయుడును ఆదేశించారు. కార్యాలయంలో వున్న ఫర్నిచర్, కంప్యూటర్లు తదితర మౌలిక వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. సచివాలయ కార్యదర్శులు కష్టపడి పనిచేసి ఈ వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలన్నారు. నగర పంచాయతీలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ కు కలెక్టర్ ఆదేశించారు. అక్కడే వున్న వలంటీర్లతో మాట్లాడి వారి పరిధిలో ఎన్ని కుటుంబాలున్నాయి, ఎన్ని ఫించన్లు వున్నాయి, రైస్ కార్డుల సర్వే గురించి ఆరా తీశారు. నెల్లిమర్ల తహశీల్దార్ రాము కూడా పాల్గొన్నారు.