ఎపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షను ఈ నెల 8 న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ఈ పరీక్షను విజయనగరం పట్టణం లో 13 కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 8న ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించే ఈ పరీక్షకు 5530 మంది అభ్యర్థులను కేటాయించినట్లు తెలిపారు. సక్రమ నిర్వహణ కోసం ప్రతి కేంద్రానికి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించామని, వీరంతా ఆయా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష నిర్వహణకు అవసరమగు వసతులు, సౌకర్యాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ నివేదికనివ్వాలన్నారు.
ప్రతి రూమ్ లో సరైన గాలి వెలుతురు ఉండేలా చూడాలన్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి, కేంద్రం వద్ద 144 సెక్షన్ కు అవసరమగు సిబ్బందిని ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ను, రూట్ వారీగా అవసరమైన బస్ లను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి వారికి ఆదేశించారు. సెంటర్ లో డైరెక్షన్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని చీఫ్ సూపరింటెండెంట్ లకు ఆదేశించారు. నిరంతర విద్యుత్తు, అత్యవసర వైద్యాన్ని అందించే మెడికల్ కాంప్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 6 న ఏపీపీఎస్సీ ప్రతినిధుల సమక్షంలో మరో సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో అభ్యర్థులకు అవసరమగు సూచనలను వెల్లడిస్తారని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ గణపతి రావు, లైజన్ అధికారులు, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.