విజయనగరం జిల్లాలోని వివిధ శాఖల్లో తలెత్తిన సమస్యలపై నమోదైన లోకాయుక్త కేసులకు సంబంధించి నిర్ణీత కాలంలో పూర్తి వివరాలతో కూడిన నివేదికలు తయారు చేసుకోవాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు సూచించారు. జిల్లాలో నమోదైన లోకాయుక్త కేసుల తాజా పరిస్థితిపై వివిధ విభాగాల అధికారులతో ఆయన గురువారం తన ఛాంబర్లో సమావేశమయ్యారు. కేసుల పూర్వాపరాలు, తాజా స్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇరు వర్గాలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకమైన జాబితాలను తయారు చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయా విభాగాల పరిధిలో నమోదైన కేసులపై సంబంధిత విభాగాధిపతులపై సంప్రదించి పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.