బాధిత వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తించేలా, ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. సోమవారం తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నగరానికి చెందిన ముగ్గురికి రూ.6.45 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ చెక్కులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన రూ.2.76 లక్షల విలువ గల మూడు త్రిచక్ర స్కూటీలను విభిన్న ప్రతిభావంతులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో పేదల సంక్షేమం కోసం చేపట్టిన పథకాల గురించి వివరించారు. జిల్లాలో సుమారు 70 స్కూటీలను ప్రభుత్వం మంజూరు చేసిందని అందులో విజయనగరం నియోజవర్గానికి చెందిన ముగ్గురికి స్కూటీలను కేటాయించటం హర్షణీయమని పేర్కొన్నారు.
అలాగే అనారోగ్యాల కారణంగా ఇబ్బంది పడిన స్థానికులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందజేసి మెరుగైన చికిత్స అందజేశామని ఆయన గుర్తు చేశారు. ఆరుగురికి రూ.9.21 లక్షల ఆర్థిక చేయూత
ఒక్కొక్క స్కూటీ విలువ రూ.92 వేలు కాగా రూ.2.76 లక్షలు వెచ్చించి నగరానికి చెందిన ముచ్చ లక్ష్మీ, దాసిరెడ్డి ఉమామహేశ్వరి, రౌతు ధనలక్ష్మిలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చేతుల మీదుగా సంబంధిత తాళాలు అందజేశారు. అలాగే అశోక్ నగర్ కు చెందిన సారిక అఖిలకు రూ.2 లక్షలు, చిక్కాల వీధికి చెందిన కిల్లంపూడి సాయి ఈశ్వర్ మోహణ్ కుషాల్‌కు రూ.45 వేలు, కె.ఎల్. పురానికి చెందిన నడింపల్లి వెంకట రామకృష్ణ రాజుకు రూ.4లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, విభిన్న ప్రతిభావంతుల విభాగం సహాయ సంచాలకులు జగదీష్, స్థానిక ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.