విజయనగరం జిల్లాలో మరో జయకేతనం..
Ens Balu
1
Vizianagaram
2020-09-24 12:16:53
విజయనగరం జిల్లా విజయపరంపర కొనసాగుతోంది. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అమల్లో కూడా జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది. హరిత విజయనగరం సాధనే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ద, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో రాష్ట్రంలోనే జిల్లాకు ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది. హరితాంధ్ర సాధనే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అమల్లో విజయనగరం జిల్లా గణనీమైన విజయాలను సాధించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకముందునుంచి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించడం పైనే ప్రధానంగా దృష్టి సారించారు. పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, పలు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ప్రారంభమయ్యే హరిత విజయనగరం కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని, తన చేతులతోనే వేలాదిగా మొక్కలను నాటారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు మన ఊరు-మన చెరువు పేరుతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులను బాగుచేసి, వాటి గట్లపై మొక్కలను నాటారు. పదుల సంఖ్యలో పార్కులకు పునర్‌జ్జీవం పోశారు. ఆక్సీజన్ పార్కుల పేరిట మినీ వనాలను రూపొందించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో జిల్లా అంతటా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు రెండేళ్లనుంచీ ఒక ఉద్యమంలా సాగుతున్నాయి. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో మొక్కలు నాటే పనిని తప్పనిసరి చేశారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమం, జిల్లాలో హరిత ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. అటవీశాఖతోపాటు, డ్వామా, ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ తదితర ప్రభుత్వ శాఖలు బాధ్యత తీసుకున్నాయి. జిల్లాలో సంతృప్త స్థాయిలో, ఖాళీ ప్రదేశమన్నది లేకుండా అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలను నాటాలన్న లక్ష్యంతో, కలెక్టర్ ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. దీంతో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అమల్లో విజయనగరం జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది. ఈ ఏడాది జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా కోటి, 24లక్షల, 14వేల, 595 మొక్కలను నాటాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 84.64 శాతం లక్ష్యాన్ని సాధించి, కోటి, 5లక్షల, 7వేల, 989 మొక్కలను ఇప్పటివరకు నాటారు. సరిగ్గా 20 రోజుల క్రితం 64శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిన మన జిల్లా, కేవలం మూడు వారాల్లోనే సుమారు 30లక్షల మొక్కలను నాటడం ద్వారా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలు మన తరువాత స్థానాల్లో నిలిచాయి.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి.. డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, జిల్లా కలెక్టర్.
మొక్కలు నాటడం ద్వారా అహ్లాదకరమైన పరిసరాలతో పాటు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గుతుంది. సకాలంలో వర్షాలు పడతాయి. అందుకే హరిత ఉద్యమంలో పాల్గొని, ప్రతీఒక్కరూ మొక్కలను నాటాలి. ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన లక్ష్యాన్ని శతశాతం పూర్తి చేయాలి. పార్కులు, పాఠశాలలు, ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాలతోపాటు, ప్రయివేటు వ్యక్తులు కూడా తమ ఇళ్లవద్ద మొక్కలను నాటేలా చైతన్య పరుస్తున్నాం. అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలను నాటించడం ద్వారా పచ్చదనాన్ని సంతృప్త స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం.