టిటిడి ఆలయాలు, అనుబంధ ఆలయాల్లో ఈనెల 28న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆలయాల అధికారులు, ఇతర విభాగాల అధికారులతో సోమవారం ఉదయం జెఈవో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ కోదండరామాల యం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయం, నారాయణవనం, నాగలాపురం, దేవుని కడప తదితర అలయాల్లో రథసప్తమి సందర్భంగా వాహనసేవలతో పాటు చక్కగా మూలమూర్తి దర్శనం కల్పించా లని ఆదేశించారు. అన్ని ఆలయాల్లో వాహనాల పటిష్టతను ముందస్తుగా పరీక్షించాలని డిఎఫ్‌వోకు సూచించా రు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథోత్సవానికి గాను రథం పటిష్టతను పరిశీలించాలన్నారు. ఆయా ఆలయాల్లో వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు.
అదేవిధంగా, జమ్మూ, చెన్నై, రంపచోడవరం, సీతంపేట ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ఆలయాల్లో మహాసంప్రోక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా ఆలయాలకు అవసరమైన ఆభరణాలు, శిలా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, అర్చక సిబ్బంది, ఇతర డెప్యుటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ ఆలయాలకు సంబంధించి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులు నివేదిక సమర్పించాలన్నారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించాలని, ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు.
అంతకుముందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల వారీగా చేపట్టిన ఏర్పాట్లు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. వర్చువల్ సమావేశంలో ఎస్‌ఇలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు గుణభూషణ్‌రెడ్డి, గోవిందరాజన్, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, విజివో మనోహర్, డిఎఫ్‌వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.