తిరుమలలో రూ.200 కోట్లతో కర్ణాటక సత్రాలు..


Ens Balu
2
Tirumala
2020-09-24 12:58:27

తిరుమలలో క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో రూ.200 కోట్ల‌తో నూతనంగా నిర్మించ‌నున్న వసతి స‌ముదాయాల‌కు  గురు‌వారం ఉద‌యం ఆంధ్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ముఖ్య ‌మంత్రులు  వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, బి.ఎస్‌.య‌డ్యూర‌ప్పలు క‌లిసి భూమిపూజ చేశారు. తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008లో టిటిడి లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో టిటిడి నిబంధనల మేరకు రూ.200 కోట్ల‌తో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టిటిడి మ‌ధ్య అంగీకారం కుదిరింది.  అంత‌కుముందు క‌ర్ణాట‌క రాష్ట్ర ఎండోమెంట్ క‌మిష‌న‌ర్  రోహిణి సింధూరి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా నూత‌నంగా నిర్మించే వ‌స‌తి స‌మూదాయాల వివ‌రాలు తెలియ‌జేశారు. ఇందులో 242 యాత్రికుల వ‌స‌తి గ‌దులు, 32 సూట్ రూములు, 12 డార్మెట‌రీలు, క‌ల్యాణ‌మండ‌పం, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు ప్ర‌స్తుతం ఉన్న పుష్క‌రిణిని పున‌రుద్ధరిస్తారు. టిటిడి ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తుంది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రులు  నారాయ‌ణ‌స్వామి,  ఆళ్ల నాని, టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు  వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు‌,  పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి, క‌ర్ణాట‌క రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ‌నివాస పూజారి, ఎంపిలు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,  మిథున్ రెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ప‌లువురు యం.ఎల్‌.ఏలు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు డి.పి.అనంత, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్‌జెట్టి, అర్బ‌న్ ఎస్పీ  ఎ.ర‌మేష్‌రెడ్డి, సిఇ  ర‌మేష్‌రెడ్డి, ఎస్ ఇ - 2  నాగేశ్వ‌ర‌రావులు పాల్గొన్నారు.