సంక్రాంతి సంబరాలను ఈ నెల 13వ తేదీన శిల్పారామం వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. తెలుగు సంప్రదాయా లు ఉట్టిపడేలా సంబరాలను నిర్వహించాలని సంబంధిత ఏర్పాట్లు చురుగ్గా చేయాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు, వివిధ పోటీల నిర్వహణ తదితర అంశాలపై ఆమె బుధవారం సాయంత్రం జిల్లాస్థాయి అధికారులతో జూమ్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగర ప్రజలకు అందుబాటులో ఉండే శిల్పారామం వేదికగా జరిగే సంబరాలను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంగా వ్యవహరించి సంబరాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రంగ వల్లుల పోటీలు, తెలుగు వస్త్రధారణ పోటీలు నిర్వహించాలని చెప్పారు.
ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబరాలను నిర్వహించాలని దానికి తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండగ శోభ సంతరించుకునేలా శిల్పారామాన్ని ముస్తాబు చేయాలని, ఆకర్షణీయంగా ఉండేలా రంగురంగుల ముగ్గులు వేయించాలని చెప్పారు. పిల్లలు, పెద్దలు వచ్చి ఆనందంగా గడిపేలా సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు. భోగి మంటలు వేసి ఆడిపాడేలా, హరిదాసు వేషాలతో అలరించేలా, ఎడ్లబండి ప్రదర్శనతో ఉత్సాహ పరిచేలా.. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి సంబరాలను విజయవంతం చేయాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
12న ముగ్గుల పోటీలు, 13న వస్త్రధారణ, వంటల పోటీలు
సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు శిల్పారామంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సంబరాల రోజు అనగా 13వ తేదీ ఉదయం నుంచి వస్త్రధారణ, వంటల పోటీలు నిర్వహించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. పోటీల్లో పాల్గొనే వారు సంబంధిత మెటీరియల్ వారే తెచ్చుకోవాలని ఆమె స్పష్టం చేశారు. పోటీల నిర్వహణకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ విభాగాలు బాధ్యతలు తీసుకొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.