వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాలకు సంభందించి, విజయనగరం జిల్లా ధరల నిర్ణాయక కమిటీ సమావేశం, కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. కమిటీ ఛైర్మెన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, వివిధ పరికరాల ధరలపై అధీకృత డీలర్లు, తయారీదారులతో చర్చించారు. ట్రాక్టర్ తో కలిపి ఉపయోగించే 9 పళ్ళ నాగలి సెట్, దమ్ము సెట్ హాఫ్ కేజ్ వీల్, హాఫ్ కేజ్ వీల్, చదును చేసే బ్లేడ్, గుంటక బ్లేడ్, రెండు పళ్ళ నాగలి, పది పళ్ళ దంతి తదితర పరికరాల ధరల నిర్ణయం పై వారితో చర్చించారు. వేర్వేరు కంపెనీల డీలర్లు, తయారీదారులు కోట్ చేసిన ధరలను, ఖరారు చేయడానికి ప్రభుత్వానికి పంపిస్తామని జెసి తెలిపారు. కంబైన్డ్ హార్వెస్టర్స్, టార్పాలిన్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్ల ధరలను ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి, ఉద్యాన శాఖాధికారి జమదగ్ని, అగ్రోస్ డిఎం ప్రసాదరావు, డాట్ సైంటిస్ట్ తేజేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఎడి ప్రకాష్, ఇతర అధికారులు, 24 మంది డీలర్లు పాల్గొన్నారు.