విజయనగరం జిల్లాలో ఈ నెల 26 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల నిషేదం అమల్లోకి వస్తుందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. ప్రతీఒక్కరూ ప్లాస్టిక్ నిషేదాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రత్యమ్నాయాలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల నిషేదంపై నిర్వహించిన అవగాహనా ర్యాలీని స్థానిక ఎత్తుబ్రిడ్జివద్ద, మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కాలుష్య నియంత్రణా మండలి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాముల నాయుడు మాట్లాడుతూ, ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల నిషేదాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పబ్లిషర్లు, ప్రింటర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైన వారికి ప్రభుత్వపరంగా సబ్సిడీ, బ్యాంకులనుంచి రుణాలు మంజూరు చేస్తున్నారన్నారు.
నిషేదాన్ని పక్కాగా అమలు చేయడానికి, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ బ్యానర్ల నిషేదంపై ఇప్పటికే మున్సిపల్ కౌన్సిల్ తీర్మాణాన్ని కూడా చేసిందని చెప్పారు. నిషేదాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా విధించేందుకు, సచివాలయ కార్యదర్శులకు, మున్సిపల్ ప్రజారోగ్యశాఖ అధికారులకు అధికారం ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు. దీనిని పాటించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరూ సహకరిచాలని కమిషనర్ కోరారు. ఈ ర్యాలీలో జిల్లా కాలుష్య నియంత్రణా మండలి ఇఇ సుదర్శన్, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.