విశాఖకె.జి.హెచ్.లో జరుగుతున్న సుందరీకరణ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. శుక్రవారం ఉదయం కె.జి.హెచ్ ఆసుపత్రిని ఆకశ్మికంగా తనిఖీ చేసారు . ఈ సందర్భంగా కలెక్టర్ ఓపి గేటు పరిసర ప్రాంతాలను అత్యవసర శస్త్ర చికిత్స విభాగమును, గిరిజన సేవా మరియు గిరిజన కేంద్రాన్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ల విశ్రాంతి గదులను, దంతవైద్య విభాగం ను ఔషద నిల్వల స్టోరు రూమ్ తో పాటు రోగులకు అందించే ఓపి విభాగంను సందర్శించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపి విభాగం ప్రధాన ద్వారం దగ్గర జరుగుతున్న పార్కు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా ప్రజా మరుగు దొడ్లను పరిశీలించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. మంచినీటి ప్లాట్ ను తనిఖీ చేసి ప్రక్కనే ఉన్న మురుగునీటి కాలవలపై పలకలను ఏర్పాటు చేయాలన్నారు. రోగులతో పాటు వచ్చే సహాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా విశ్రాంతి గదులను తీర్చి దిద్దాలన్నారు. అత్యవసర శస్త్ర చికిత్స గదులలో అవసరమైన చోట ఎ సి లను ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విధులలో ఉన్న డాక్టర్లు అవసరమైన సమయంలో విశ్రాంతి తీసుకొనేందుకు ఆదునీకరించిన డాక్టర్స్ రూమ్ ను పరిశీలించారు.
అనంతరం దంత వైద్య విభాగాన్ని పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. రోగులకు ఉచితంగా పంపిణీ చేసే ఔషద నిల్వ ఉంచే స్టోర్ రూమ్ ను పరిశీలించారు. అదే విధంగా ఓపి రశీదుల విభాగం ను పరిశీలించి రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆధునీకరించడంతో పాటు వాహనాల పార్కింగ్, రోడ్డు నూతనంగా వేయాలని అన్నారు. ఓపి వద్ద ఉన్న గోడకు సుందరంగా పెయింటింగ్ వేయించాలని ప్రవేశ ముఖ ద్వారం సుందరంగా తీర్చి దిద్దాలన్నారు.
ఈ కార్యక్రమంలో కె.జి.హెచ్ సూపరింటెండెంట్ డా.అశోక్ కుమార్, ఆర్.ఎం .ఓ వాసుదేవరావు, వివిద విభాగాల డాక్టర్లు, ఎ.పి.ఎం.ఐ.డి.సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నాయుడు తదితరులు పాల్గొన్నారు.