తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుండి 6 నెలలపాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నామని, ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.