తిరుమలలో శనివారం జరగనున్న రథసప్తమి పర్వదినం సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన ఏర్పాట్లను జెఈఓ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. గ్యాలరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో డిప్యూటేషన్ విధులు కేటాయించిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిల వద్దకు భక్తులు సులువుగా వెళ్లేలా దారి ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీలకు అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్ల వద్ద మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.
జెఈఓ వెంట టిటిడి ఎఫ్ఏసిఎఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, విజివోలు బాలిరెడ్డి, మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శాస్త్రి ఇతర అన్ని విభాగాల అధికారులు ఉన్నారు.