నిరుపేదలకు తక్షణ వైద్యసహాయం..మంత్రి అవంతి


Ens Balu
1
Rk beach
2020-07-02 23:05:22

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అత్యవసర, ఆధునిక వైద్య సేవలు అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు ఆధునీకరించిన 108, 104 సర్వీసులను తీసుకువచ్చామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆర్కే బీచ్ లో ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన ఆధునీకరించిన 108,104 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మండలానికి 108 అంబులెన్స్ సర్వీస్, అత్యవసర చికిత్స వాహనాలను మొత్తం రాష్ట్రంలో 1,088 సర్వీసులను వాడుకలోనికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ వాహనాలకు కెమెరా, జిపిఎస్, మొబైల్ డేటా లను ఏర్పాటు చేశారని, 74వేల మందికి ఒక వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. రోగులకు అత్యవసరంగా చికిత్స అందించడం, దగ్గరలోని ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు 108 అంబులెన్స్ వాహనాలను ఉపయోగిస్తారన్నారు. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలలో మారుమూల వారికి షుగరు,బి.పి.,టి.బి., లెప్రసీ మొదలైన అనారోగ్యాలకు చికిత్స అందించడం, మందులు సరఫరా చేయడానికి 104 వాహనాలు ఉపయోగపడతాయన్నారు. పట్టణ ప్రాంతాలలో ఫోన్ కాల్ అందుకున్న 15 ని.లకు వాహనం వస్తుందని గ్రామీణ ప్రాంతంలో 20 ని.లు ఏజెన్సీ ప్రాంతంలో 25 ని.లలో సేవలు అందుతాయన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ సాంకేతిక పరంగా అభివృద్ధి చెంది, మరింత ప్రతిభావంతంగా సేవలు అందించే విధంగా 108 104 వాహనాలను తీర్చిదిద్దారని చెప్పారు. జిల్లాలో ఈ వాహనాల కు సంబంధించి 235 మందిని కొత్తగా నియమించినట్లు, వారిలో 52 మంది డాక్టర్లు 46 డేటా ఎంట్రీ ఆపరేటర్ లు 92 డ్రైవర్లు 45 టెక్నీషియన్లు ఉన్నారని తెలిపారు. వారి సర్వీసును బట్టి వేతనాలను కూడా అధికారులు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి సత్యవతి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కె భాగ్యలక్ష్మి, జెసి 2 అరుణ్ బాబు, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆర్ డి ఓ కె.పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.