సచివాలయాల ద్వారా 550 రకాల సేవలు..


Ens Balu
1
Pendurthi
2020-09-24 18:52:28

గ్రామ సచివాలయాలు ద్వారా ప్రజలకు అవసరమైన సేవలన్నీ అందించాలని జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం పెందుర్తి మండలం సరిపల్లి గ్రామం, సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామాల్లోని సచివాలయాలను ఆయన సందర్శించారు. సచివాలయం ద్వారా 550 రకాల సేవలు అందించేందుకు ఉద్యోగులు మరింత చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు.  నూతనంగా నిర్మించనున్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ స్థలాలను పరిశీలించి,  పనులను సత్వరమే ప్రారంభించి పూర్తిగావించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.  వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వారి పరిధిలోని ప్రజలకు  అవసరమైన సేవలన్నీ వారే అందించాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చే స్పందన వినతులను సచివాలయం స్థాయిలోనే పరిష్కరించాలని, అక్కడ పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను మాత్రమే పై స్థాయికి పంపించాలన్నారు.  మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్   కమీషనర్లు, ఐ.టి.డి.ఎ. పరిధిలో  ప్రాజెక్టు అధికారి మరియు  సబ్ కలెక్టరు, రెవిన్యూ డివిజినల్ అధికారి పరిధిలో ఆర్డిఓ ప్రతివారం  2 మండలాలలో పర్యటించి సచివాలయాలల్లోని మౌళిక వసతులను పరిశీలిస్తారని తెలిపారు.     అనంతరం సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించారు.  అక్కడ సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రతీ రోజు ఉదయం గ్రామాన్ని శుభ్రం చేస్తున్న పారిశుద్య కార్మికులు ఏ విధంగా చేస్తున్నదీ పరిశీలించాలన్నారు.  శుభ్రతలో ఏమైనా లోపాలు ఉంటే కార్మికులకు చెప్పాలని ఆదేశించారు.  సచివాలయం ద్వారా 550 రకాల సర్వీసులు ప్రజలకు అందించాల్సి ఉందని, వాటిని దృష్టిలో పెట్టుకొని చురుకుగా పనిచేయాలన్నారు.  అక్కడ అదనంగా నిర్మిస్తున్న సచివాలయం గదులను ఆయన సందర్శించి పరిశీలించారు. నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  ఈ కార్యక్రమంలో  గృహనిర్మాణశాఖ  ప్రోజెక్టు డైరెక్టరు రఘరామాచారి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇ.ఇ. రామారావు, పెందుర్తి, సబ్బవరం మండలాల తహసిల్థార్లు, మండల అభివృద్థి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.