విజయనగరంజిల్లాలో ఈ నెలాఖరుకి జిల్లాలో ఫిష్ ఆంధ్రా యూనిట్లను ప్రారంభించాలని, మత్స్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మత్స్యశాఖ ద్వారా జరుగుతున్న వివిధ అభివృద్ది పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారీగా సంబంధిత మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లను ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్దిదారులను చైతన్యపరిచి, యూనిట్లను త్వరగా ప్రారంభించేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటికే ఎంపికైన లబ్దిదారులచేత, ఈ నెలాఖరుకల్లా ప్రారంభింపజేయాలని ఆదేశించారు. సొంత స్థలాల్లో యూనిట్లను స్థాపించడానికి ముందుకువచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మున్సిపల్, పంచాయితీ స్థలాల్లో షాపులను పెట్టుకొనేవారి దగ్గరనుంచి, నిబంధనల ప్రకారం ఆయా స్థానిక సంస్థల తీర్మాణంతోపాటుగా, సమగ్ర వివరాలతో ఒప్పందాన్ని కూడా తీసుకోవాలని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంతోపాటు, ప్రజలకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను అందించడానికి, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, లక్ష్యాలను శతశాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేలా చూడాలన్నారు. జిల్లాలో మత్స్యసంపద అభివృద్దికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మండల, జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ, లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ డిప్యుటీ డైరెక్టర్ నిర్మలాకుమారి, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, మెప్మా పిడి సుధాకరరావు, ఎల్‌డిఎం శ్రీనివాసరావు, డిసిసిబి సిఈఓ జనార్ధనరావు, మత్స్య అభివృద్ది అధికారులు, సహాయాధికారులు, గ్రామ మత్స్య సహాయకులు పాల్గొన్నారు.