కాకినాడ జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ, నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని.. వాటి వాడకం దుష్పరిణామాలపై అవగాహన ప్రజల్లో కల్పించాలని కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధ్యక్షతన మాదక ద్రవ్యాల నివారణ, చిన్నారులు వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై వర్చువల్‌గా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తితో పాటు వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని.. వాటి నివారణతో పాటు వినియోగం జరక్కుండా చూసేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎవరివద్దనైనా డ్రగ్స్ ఉన్నట్లు తేలితే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుష్పరిణామాలు, కౌన్సెలింగ్, చట్టపర శిక్షలు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలని.. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ; కమిటీ కన్వీనర్, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ; విద్యాశాఖ, సాంఘిక సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, శిశు సంక్షేమం, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో పాటు ఛైల్డ్ లైన్ 1098, ఛైల్డ్ ఫండ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.