ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు...
Ens Balu
1
Vizianagaram
2020-09-24 19:22:50
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు పకడ్భంధీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గతంలో చోటుచే సుకున్న లోపాలకు ఈ సారి తావివ్వకుండా, పారదర్శకంగా, ఆదర్శనీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లూ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై వ్యవసాయశాఖ, పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు, కాంట్రక్టర్లతో తన ఛాంబర్‌లో గురువారం సన్నద్దతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా జెసి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తిపై మండలాల వారీగా ఖచ్చితమైన అంచనాలను రూపొందించాలని వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా సేకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంతకుముందు లాగే ఈ సారి కూడా ధాన్యం కొనుగోలును వెలుగు కొనుగోలు కేంద్రాలు, పిఎసిఎస్‌ల ద్వారా సేరించడం జరుగుతుందన్నారు. అందువల్ల ప్రతీ కొనుగోలు కేంద్రంలో తూనిక యంత్రాలు, తేమ కొలిచే సాధనాలు తదితర అన్ని రకాల పరికరాలనూ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. అయితే రైతుల నమోదు, ఇ-క్రాప్, తేమ తనిఖీ, ఇతర సాంకేతిక సహకారాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని చెప్పారు. మిల్లర్లు ఎప్పటికప్పుడు తమకు చేరిన ధాన్యాన్ని మరపట్టి, సకాలంలో సిఎంఆర్ ఇవ్వడం ద్వారా సహకరించాలని కోరారు.
నవంబరు నుంచి ధాన్యం సేకరణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దీనికి అనుగుణంగా అక్టోబరు 20 నుంచి బ్యాంకు గ్యారెంటీలను సమర్పించాలని సూచించారు. బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడంలో జరుగుతున్న లోపాన్ని నివారించాలని డిసిసిబి అధికారులను జెసి ఆదేశించారు. అలాగే త్వరలో 105 కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్నను నిల్వ చేసేందుకు వీలుగా గోదాములను సిద్దం చేసి, ప్రణాళికా బద్దంగా కేటాయించాలన్నారు. గోదాములకు కొరత రాకుండా చూడాలని భారత ఆహార సంస్థ, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు అనుగుణంగా వాహనాలను సిద్దం చేయాలని సంబంధిత కాంట్రాక్టరును ఆదేశించారు. ప్రతిఏటా ధాన్యం కొనుగోలు సమయంలో జిల్లాలో ఏదోఒక సమస్య ఉత్పన్నం అవుతోందని, ఈ సారి అటువంటి వాటికి అవకాశాలు ఇవ్వకుండా, ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలూ తీసుకొని, ఇతర జిల్లాలకు ఆదర్శంగా మన జిల్లాలో కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని జెసి కోరారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ వరకుమార్, ఏజిఎం కల్యాణి, డిసిసిబి సిఇఓ జనార్ధన్, ఇతర శాఖల అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.