విశాఖ-చెన్నై కారిడార్ పనులు వేగం పెంచాలి..
Ens Balu
5
కలెక్టరేట్
2020-09-24 20:04:02
విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్ జె. వి.ఎన్. సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి తో కలిసి ఆయన వివిధ విషయాలపై సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించి భూ సేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. కారిడార్ కు సంబంధించిన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అభివృద్ధి పనులకు కేటాయించిన భూమిని సంబంధిత శాఖలకు అందజేయాలన్నారు. ముందుగా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో నెలకొల్ప బోయే సబ్ స్టేషన్ కు భూమిని, అనకాపల్లి నుండి అచ్యుతాపురం వరకు నిర్మించబోయే రోడ్డు, నక్కపల్లి నుండి ఇండస్ట్రియల్ క్లస్టర్ వరకు చేసే రోడ్లకు సంబంధించిన భూమిని వేగంగా పనులు ప్రారంభించేందుకు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కాపులుప్పాడ లోని విద్యుత్ సబ్ స్టేషన్ భూగర్భ కేబుళ్ళ ఏర్పాటు కు అనుమతి పై జీవీఎంసీ, నేషనల్ హైవే అధికారులతో సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు డిపిఆర్ ను సమర్పించడం పై కూడా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, అనకాపల్లి ఆర్టీవో సీతారామరావు, ఎస్ డి సి అనిత, ఏపీ ట్రాన్స్ కో, జీవీఎంసీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.