లఘు చిత్రాలతో ప్రజలు చైతన్యం కావాలి..
Ens Balu
5
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-24 20:19:23
ప్రజలను చైతన్యపరచే సందేశాత్మక లఘు చిత్రాలను రూపొందించాలని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన చాంబర్ లో ర్యాగింగ్ పై సనరా ఫీనిక్స్ మూవీస్ ఆధ్వర్యంలో రూపొందించిన " రెస్పెక్ట్ " షార్ట్ ఫిల్మ్ సిడి ని ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక మార్పుకోసం,ప్రజలను చైతన్య వంతం చేసే కథలతో మేకర్స్ మంచి లఘు చిత్రాలను చేయాలని చెప్పారు. దర్శకుడు సత్యాడ నరసింగరావు, నిర్మాత శరత్ చంద్ర ఇదే కోవలో మంచి కాన్సెప్ట్ తో 'రెస్పెక్ట్ ' అనే లఘు చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం అన్నారు. ర్యాగింగ్ వలన ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు,వారి కుటుంబ సభ్యుల ఆవేదనను ఈ లఘు చిత్రం ద్వారా చూపించారని పేర్కొన్నారు. ఈ టీమ్ భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలను చేయాలని అభిలాషించారు. జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సనరా ఫీనిక్స్ మూవీస్ బ్యానర్ పై ఇప్పటి వరకు ఎన్నో మంచి ఫిల్మ్ లను తీసిన దర్శక,నిర్మాతలు మరో ప్రయత్నం లో ర్యాగింగ్ కాన్సెప్ట్ పై 'రెస్పెక్ట్' అనే ఫిల్మ్ చేయడం అభినందనీయం అన్నారు. ఈ టీమ్ తీసిన ఫిల్మ్ లకు రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వచ్చాయని చెప్పారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని లఘు చిత్రాలను రూపొందిస్తున్న దర్శకుడు సత్యాడ నరసింగరావు, నిర్మాత శరత్ చంద్ర భవిష్యత్ లో మరో మంచి కథతో సినిమా చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సత్యాడ నరసింగరావు, నిర్మాత శరత్ చంద్ర, అసోసియేట్ డైరెక్టర్ శశి, అసిస్టెంట్ డైరెక్టర్ పి.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.