గ్రామ, వార్డు సచివాలయాలలో డాక్యుమెంటు రిజిస్ట్రేషను ప్రారంబించుటకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పధకాలు అమలు గూర్చి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీ-సర్వే, భూసేకరణ, మ్యుటేషన్స్, భూ వినియోగ మార్పిడి, జాతీయ రహదారుల ప్రోజెక్టులు, వ్యవసాయ రంగానికి సంబంధించి రబీ కాలానికి ఇ-క్రాప్ బుకింగు, బిందుసేద్యం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, జగనన్న పాలవెల్లువ, వై.ఎస్.ఆర్.చేయూత, గృహ నిర్మాణం, చిరుధాన్యాల సాగు,వినియోగ ప్రోత్సాహం మొదలైన పధకాలు అమలును జిల్లాల వారీగా లక్ష్యాలను సమీక్షించారు.
డాక్యుమెంటు రిజిస్ట్రేషను చేయుటకు అవసరమైన ప్రక్రియ వెంటనే పూర్తిచేయాలని, అందుకు గాను భూ రికార్డులను స్వచ్చీకరించాలని, భూ యజమానులకు అందిస్తున్న భూహక్కు పత్రాలలో పేరు, సర్వేనంబర్ల వివరాలు తప్పులు లేకుండా రికార్డులను 16వ తేదీ నాటికి సిద్దం చేయాలన్నారు. పాత జీ.ఒ. ప్రకారం వచ్చిన భూ వినియోగ మార్పిడి ధరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. భూ సేకరణ, జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. 20వ తేదీలోపుగా రబీ పంట ఇ-క్రాప్ బుకింగు పూర్తిచేసి గ్రామ వ్యవసాయ సహయకుడు, గ్రామరెవిన్యూ అధికారి దృవీకరణ పూర్తిచేయాలని తెలిపారు. రైతుభరోసా కేంద్రాలలో ఏర్పాటుచేస్తున్న వై.ఎస్.ఆర్.యంత్ర సేవా పధకం నకు రైతులతో సంఘాలు ఏర్పాటుచేసి, ప్రభుత్వం అందించే సబ్సడీతో యంత్రాలు కొనుగోలు చేయాలన్నారు. చిరుదాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఉద్యాన పంటలలో అంతర పంటలుగా చిరుదాన్యాలను సాగుచేయించాలన్నారు. లక్ష్యం మేరకు బిందు సేద్యం అమలుచేయాలని, వర్షాధార ప్రాంతాలలో చిరుదాన్యాల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. పట్టు పరిశ్రమ, మత్స్యశాఖల ద్వారా అమలు చేస్తున్న పధకాలను వేగవంతం చేయాలన్నారు.
ఉగాది నాటికి లక్ష్యం మేరకు గృహాల నిర్మాణాలు పూర్తిచేయుటకు అవసరమైన నిధులను ప్రభుతం అందిస్తున్నదని, పనులు పూర్తిచేయుటకు కావలసిన సహకారం అందిస్తామని, ఇసుక, సిమెంటు తదితర మెటీరియల్ అవసరమైతే ఇండెంటు పెట్టాలని తెలిపారు. వై.ఎస్.ఆర్. చేయూత, వై.ఎస్.ఆర్. పాలవెల్లువ, బల్క్ మిల్క్ కూలింగు సెంటర్ల నిర్మాణం లక్ష్యాలు పూర్తిచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ జిల్లా నివేదికలను తెలియజేస్తూ జిల్లాకు జాతీయ రహదారులతో రోడ్డు అనుసందానం లేదని, జిల్లా కేంద్రం పార్వతీపురం ను కలుపుకుంటు జాతీయ రహదారి మంజూరు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టరు అధికారులతో సమీక్షిస్తూ రబీ పంటకు ఇ-క్రాప్ నమోదు 20వ తేదీ నాటికి పూర్తిజేయాలన్నారు. గృహనిర్మాణాలకు సంబంధించి మండల వారీగా లక్ష్యాలు నిర్దేశించి పనులు వేగవంతంచేయాలని, అవసరమైన నిధుల కొరకు నివేదిక ను తయాయచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు ఒ.ఆనంద్, ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి సి. విష్ణుచరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా మత్స్య శాఖ అధికారి వేమూరి తిరుపతయ్య, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్, జిల్లా సూక్ష్మ నీటి అధికారి ఎల్.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.