విజయనగరం జిల్లాలోని సారిపల్లి, సోనియా నగర్లో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను లబ్ధిదారులు, అధికారులతో కలిసి టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ శనివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను, మౌలిక వసతుల కల్పనను పరిశీలించారు. ఇక్కడ నిర్మించిన 2,976 గృహాలకు సంబంధించి మార్చి నెలలో ప్రవేశాలు కల్పించేలా పనులు పూర్తి చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్ సదుపాయానికి సంబంధించి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను ఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించి మార్చి నాటికి అన్ని గృహాలను అందుబాటులోకి తీసుకురావాలని, మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన పనుల్లో మరింత పురోగతి సాధించాలని నిర్దేశించారు. టిడ్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ నరసింహ మూర్తి, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ, సీఎల్టీసీ శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.