ఫిష్ ఆంధ్రా లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలి


Ens Balu
56
Vizianagaram
2023-02-11 07:02:39

విజయనగరం జిల్లాలో ఫిష్ ఆంధ్రా లక్ష్యాలను మత్స్యశాఖ సకాలంలో పూర్తిచేసి యూనిట్లను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారితో కలిపి ఆమె డివిజన్ స్థాయి అధికారులతో అభివృద్ధిపనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ల‌బ్దిదారుల‌ను చైత‌న్య‌ప‌రిచి, యూనిట్ల‌ను త్వ‌ర‌గా ప్రారంభించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లాలో 112 మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా,  112 మంది లబ్దిదారుల వాటాసొమ్ము  కట్టించి..అందులో 58 మందితో వెండింగ్ యూనిట్లు  ప్రారంభించారన్నారు. వారందరికీ డిసిసిబి బ్యాంకు రుణాలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఈ షాపులన్నిటికీ కూడా పెయింటింగ్ వేయించి, సప్లై ఆర్డర్లును మంజూరు చేశామన్నారు. 

 సొంత స్థ‌లాల్లో యూనిట్ల‌ను స్థాపించ‌డానికి ముందుకువ‌చ్చే వారికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కలెక్టర్ సూచించారు. మున్సిప‌ల్, పంచాయితీ స్థలాల్లో షాపుల‌ను పెట్టుకొనేవారి ద‌గ్గ‌ర‌నుంచి, నిబంధ‌న‌ల ప్ర‌కారం  స్థానిక సంస్థల తీర్మాణంతోపాటు స‌మ‌గ్ర వివ‌రాల‌తో ఒప్పందాన్ని కూడా తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు.  మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల కుమారి మాట్లాడుతూ, హబ్ & స్పోక్స్ లో భాగంగా విజయనగరం జిల్లాలో  రూ.10. 00 లక్షల ఫిష్ కియోస్క్ యూనిట్లు 3,  రూ.20 లక్షల లైవ్ ఫిష్ వెండి యూనిట్ 1, రూ.50 లక్షల వాల్యూ యాడెడ్ యూనిట్లను గుర్తించి వారిచేత ఇప్పటికే లబ్దిదారుల వాటాను కట్టించి యూనిట్లును ఏర్పాటు చేస్తున్నారు.  అంతేకాకుండా రూ.50.00 లక్షల యూనిట్ కు బ్యాంకు ఋణం మంజూరై, గ్రౌండింగ్ కు సిద్దంగా ఉన్నదని తెలియజేశారు.

 యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు, ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను అందించ‌డానికి, ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని, ల‌క్ష్యాల‌ను శ‌త‌శాతం పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మండ‌ల‌, జిల్లా స్థాయిలో డీఆర్డీఏ, మెప్మా, ఆర్టీసీ తదితర సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌లను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకి వెళుతున్నట్టు డిడి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు