విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2 విభాగంలో శనివారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్థానిక సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ఆయన రోగుల వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద తీవ్రతను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని ఇద్దరు, ముగ్గురికి 50 నుంచి 65 శాతం, మిగిలిన వారికి 20 నుంచి 25 శాతం కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. వైద్య సహాయ విషయంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా చూడాలని ప్లాంట్ అధికారులను మంత్రి ఆదేశించారు.
అవసరమైతే మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఈ మేరకు ముంబైలో సంబంధిత వైద్యులతో కూడా మాట్లాడినట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించనున్నామని అమర్నాథ్ తెలియజేశారు. కార్మికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను మంత్రి అమర్నాథ్ కలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. మంత్రి అమర్నాథ్ వెంట ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తదితరులు ఉన్నారు.